స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక తమ వివాహ బంధానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట, తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రత్యేకంగా జరుపుకుంది.
క్రిస్టియన్ సంప్రదాయాన్ని గుర్తు చేసేలా జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు వారి పిల్లలు దియా, దేవ్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఎమోషనల్ వీడియోను జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో జ్యోతిక తెల్లటి బ్రైడల్ గౌన్‌లో చర్చిలోకి ప్రవేశిస్తుండగా, కుమారుడు దేవ్ ఆమె వెంట నడుస్తూ కనిపిస్తాడు. మరోవైపు కుమార్తె దియా సూర్య పక్కన నిలబడగా, జ్యోతిక తనవైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాన్ని చూసి సూర్య భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తాడు.
అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సూర్య, జ్యోతిక ఒకరికి ఒకరు మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు.
సూర్య సోదరుడు, నటుడు కార్తి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వేడుకకు సంబంధించిన కొన్ని సహజమైన కుటుంబ క్షణాల్లో ఆయన కనిపించారు.
ప్రమాణాల కార్యక్రమం పూర్తయ్యాక చర్చ్ నుంచి బయటకు వస్తున్న సూర్య, జ్యోతికపై కుటుంబ సభ్యులు, స్నేహితులు పూల రేకులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు.
20 ఏళ్ల తర్వాత కూడా అదే ప్రేమ…
సూర్య, జ్యోతిక జంట అదుర్స్.
‘THE SEQUEL’ అంటూ జ్యోతిక ఎమోషనల్ పోస్ట్
ఈ ప్రత్యేక వేడుకకు జ్యోతిక “THE SEQUEL” అనే పేరు పెట్టారు. తమ బంధాన్ని “20 years of love and war” అంటూ భావోద్వేగంగా వర్ణించారు.
తమ వివాహ జీవితం ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా సాగిందని చూపించేందుకు ఈ వేడుక చేయలేదని ఆమె స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల ప్రయాణంలో ఎదురైన సర్దుబాట్లు, త్యాగాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, స్వార్థం లేని ప్రేమ తమ బంధాన్ని బలంగా నిలబెట్టాయని పేర్కొన్నారు.
మళ్లీ చేసిన ప్రమాణాల్లో ఆనందం, కృతజ్ఞత, ఆరోగ్యం, మాతృత్వం, సూర్యతో తనకు ఉన్న స్నేహం గురించి జ్యోతిక ప్రస్తావించారు.
సూర్యను తన సమాన భాగస్వామిగా, మనసులోని విషయాలు పంచుకునే వ్యక్తిగా, అత్యంత సన్నిహిత స్నేహితుడిగా భావిస్తున్నట్లు ఆమె రాశారు. పర్ఫెక్ట్ జంటగా కాకుండా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే ఇద్దరు వ్యక్తులుగా మరో 20 ఏళ్ల ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.
2006లో వివాహం చేసుకున్న సూర్య, జ్యోతిక
సూర్య, జ్యోతిక సెప్టెంబర్ 11, 2006న చెన్నైలో వివాహం చేసుకున్నారు.
ఇద్దరూ మొదటిసారి 1999లో విడుదలైన తమిళ చిత్రం ‘పూవెల్లం కేట్టుప్పార్’లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారి చివరకు వివాహ బంధానికి దారితీసింది.
వివాహం జరిగిన 20 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పిల్లలు దియా, దేవ్ కూడా భాగమవడం వేడుకకు మరింత కుటుంబ అనుబంధాన్ని తీసుకొచ్చింది.
సూర్య, జ్యోతిక మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్న వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.


